Friday, May 17, 2013

మన చదువులు మారేదెన్నడో?

పదవతరగతి రిజల్ట్స్‌లో మా స్కూల్ ఫస్ట్ అంటే మాది ఫస్ట్ అంటూ టీవీల్లో పోటాపోటి ప్రకటనలు గ్యాప్ లేకుండా వేస్తున్నారు. బహుశా, మరికొన్నేళ్ళు ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చేమో? కానీ, ఒకరోజు రావాలి....ప్రశ్నాపత్రాలను పుస్తకాల్లో ఉండే క్వశ్చన్లతో కాకుండా పూర్తి concept ఓరియంటెడ్‌గా ఇవ్వాలి. అంటే, ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడా పుస్తకాల్లో లభించకూడదు. కేవలం ఆ విద్యార్థి తాను పుస్తకాల్లో చదువుకొని సంగ్రహించిన లేదా చుట్టూ సమాజాన్ని గమనిస్తూ గ్రహించిన నాలెడ్జ్ ఆధారంగానే రాయాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని వాటిని మాత్రమే ఎక్కువగా బట్టీపట్టే విధానం తగ్గిపోయే రోజు రావాలి. అప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టడం కూడా కష్టమైపోతుంది. :-)

ప్రస్తుత పరిస్థితుల్లోనే అమలుచేయచ్చా అంటే చేయడం కష్టం. సమస్య అయ్యవార్లతోనూ, పిల్లలతోనూ కాదు. పిల్లల తల్లిదండ్రులతోనే వస్తుంది. ఒకప్పుడంటే చదవకపోతే పిల్లాడిది తప్పు. కానీ, ఇప్పుడు అయ్యవార్లది లేదా స్కూల్ మీద ఎక్కువగా నిందలు వేస్తున్నారు. ఇన్ని లక్షలు ఫీజు రూపంలో కట్టాం, మా పిల్లాడికి కనీసం తొంభై శాతం మార్కులు రాకపోతే ఎలా? అని ప్రశ్నిస్తారు. అఫ్‌కోర్స్, అది ప్రైవేట్ స్కూళ్ళ తలనొప్పి. ఇక ప్రభుత్వ బడుల గురించి ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. ప్రజలనుంచి ఇప్పటికే ప్రభుత్వబడులమీద ప్రోత్సాహం కరువైంది.

ప్రస్తుత విధానంలోనే పాస్ పర్సెంటేజీ యాభైశాతం మించట్లేదు, మరి కొత్తగా కాన్సెప్ట్‌తో రాయమంటే పాస్ పర్సెంటేజీ బాగా తగ్గిపోవచ్చు. దాంతో మళ్ళీ అయ్యవార్లమీద ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. మాకెందుకు రిస్క్ అనుకుంటూ అయ్యవార్లు కూడా ఆ మార్కులేదో ఏసేస్తే పోలా అనే స్థితి వస్తుంది. ఎందుకంటే రిస్క్ తీసుకునేవాళ్ళను ఈ సమాజం ఎంకరేజ్ చెయ్యదు. నీకెందుకువచ్చిన తలనొప్పి అంటూ వెనక్కి ఎప్పుడూ లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్‌కు కాన్సెప్ట్స్ నేర్పించాలంటే చాలా టైమ్ స్పెండ్ చెయ్యాలి. ప్రాక్టికల్‌గా అర్థమయ్యేట్లు వివరించాలి. దానికి ఓపికతో పాటు టైమ్ కూడా చాలా కావాలి. ఓపిక ఉన్నా టైమ్ ఉండదు. ఈ టైమ్ కల్లా ఈ సిలబస్ పూర్తి చెయ్యాలి, ఈ టైమ్‌కల్లా పరీక్షలు అయిపోవాలి అని ఒత్తిళ్ళు ఉంటాయి. అది కూడా ప్రస్తుతం స్కూల్స్‌లో ఉన్న వనరులతో అర్థమయ్యేలా explain చెయ్యడం నాకు తెలిసి అంత సులభం కాదు. దానికన్నా ఒక ఫార్ములా బట్టీ పట్టడం చాలా సులభం.

(ఈ విషయంలో రాయాలంటే చాలా ఉంది. ఇప్పటికే పెద్దదైపోయింది టపా....మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు రాస్తాను).

No comments:

Post a Comment