Thursday, May 16, 2013

చేపలాట......

ॐ శ్రీరామ

చేపల్ని పట్టడం చిన్నప్పుడు ఒక సరదా....పట్టడం వరకే కానీ వాటిని తినాలనిపించేది కాదు....పట్టడంలో బోల్డు పద్ధతులుంటాయని అందరికీ తెలిసిందే.... ఒక మడుగులో తిరుగాడుతున్న చేపల్ని బుడుకుతూ కాళ్ళతో తొక్కి పట్టుకోవడం, గాలం వేసి పట్టడం, వల వేసి పట్టడం ఇలా అన్నమాట....

వీటిల్లో గాలం వేసి పట్టడం మంచి కాలక్షేపం. ఒక గాలానికి ఎరను తగిలించి చేపను ఆకర్షించి గాలానికి చిక్కుకొనేలా చేయడం ఇందులో పద్ధతి. చిన్నప్పుడు గాలం కొనేంత డబ్బులు నా దగ్గర ఉండేవి కావు. బహుశా రూపాయో, రెండ్రూపాయలో ఉంటుందనుకుంటా ఆ గాలం. కానీ, ఆ కాలంలో రూపాయికి చాలా విలువుండేది మరి.

మొదటిసారి జతగాళ్ళు (జతగాళ్ళు = ఫ్రెండ్స్) పిలిస్తే సరదాగా వాళ్ళతో పాటుగా వెళ్ళాను. అక్కడ అప్పటికే కొందరు పిల్లలు చేపలు పడుతున్నారు. ఒక చిన్న నీటిగుంట...ఎప్పుడో ఏరు పారినప్పుడు ఏదో ఫారిన్‌కొచ్చామని సంబరపడిపోతూ ఆ గుంటలో నీటితోపాటుగా నిలబడిపోయిన చేపలు...ప్రాప్తకాలజ్ఞతలేని ఆ చేపలు పిల్లల చేతిల్లో బంధీలైపోయి ఒడ్డునపడి ఒక్కొక్కటిగా బకెట్ తన్నేస్తున్నాయి.

ఒక కర్రకు దారం కట్టి దారం చివరన గాలం కట్టి ఉంది. దారానికి మధ్యలో ఒక చిన్న పుల్ల కట్టి ఉంది. దారాన్ని నీటిలోకి విసిరినప్పుడు గాలం నీటిలో మునిగి, పుల్ల నీటిపైన తేలుతూ ఉంటుంది. చేప గాలాన్ని టచ్ చేసినా లేదా గాలాన్ని నోట కరచుకొని ఎరను లాగినా ఆ పుల్ల నీటిలో మునిగిపోతుంది తద్వారా మనకు చేప గాలానికి చిక్కిందన్న విషయం అర్థమైపోతుంది. వెంటనే లాగేస్తే చేప దొరికేస్తుంది.ఇది క్లుప్తంగా గాలంతో చేపలు పట్టే విధానం.

ఫస్ట్ టైమ్ చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరి మనకు గాలం ఎలా? డబ్బులు లేవు కదా....ఏం చెయ్యాలి? గాలాన్ని అబ్సర్వ్ చేశాను. ఐడియా! పిన్నీసును తీసుకొని దాన్ని అటూ ఇటూ ఒంచి గాలం షేపులో తయారు చేశాను. తర్వాత ఏం చెయ్యాలి? ఎర కావాలి? ఎర అంటే? వానపాములు. ఎక్కడ దొరుకుతాయి? భూమిలో? ఏ భూమిలో? అవతలి ఒడ్డున ఉన్న భూమిలో కొంచెం తడిగా బంకగా ఉంది, అక్కడ తవ్వితే దొరుకుతాయి? అవునా! అయితే సరే...వాళ్ళు చెప్పినట్లే తవ్వాను. ఏదో పురుగు వచ్చింది. కెవ్వ్వ్వ్వ్వ్వ్..... కానీ, అవతలివాడు సంతోషంగా దాన్ని రెండు ముక్కలు చేశాడు. అయినా అది చావలేదు. వామ్మో! ఇదేంటి ఇలా ఉంది. అదంతే, అలానే ఉంటుంది కానీ, ముందు దీన్ని పట్టుకో...వీటినే ఎరలంటారు, ఇలా పట్టుకొని గాలంలోకి చెక్కాలి అని చేసి చూపించాడు. యాక్క్క్క్క్క్..........(ఫస్ట్ టైమ్ కదా)

మెల్లమెల్లగా ధైర్యం వచ్చాక రంగంలోకి దిగాను. పిన్నీసుతో గాలమాఆఆఆఅ! కికికి అంటూ పగలబడి నవ్వారందరూ....లైట్ అనుకొని నీళ్ళలోకి గాలాన్ని విసిరేశాను. ఏం జరుగుతుందోనని ఉత్కంఠ. పిన్నీసు గోవిందా అని ఒకడు, నీ ఎరలు నాకిచ్చేయ్ అని ఇంకొకడు కామెంట్లు.... కాసేపయ్యాక నా గాలాన్ని ఒక చిన్న చేప లాగడం మొదలెట్టింది....పుల్ల లోపలికంటా మునిగిపోయింది....లాగేయ్య్య్య్య్......లాగేశాను. అబ్బ్బ్బాఆఆఆఅ...... ఆ చేప అటుపక్కనున్నోడి మీద పడి దానికున్న ముళ్ళు గుచ్చుకుంది. అవును, ఆ చేప రకాలు అంతే....వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదంటే చేయి కోసుకుపోవడం ఖాయం. వామ్మో! భయమేసింది. తొందరపడి పట్టుకున్నాను కాదు, చేయి తెగి ఉంటే ఇంట్లో వీపు విమోనం మోతే....

మొత్తానికి విజయవంతంగా రెండో, మూడో చేపలు పట్టాను. వాటిని వాళ్ళకే ఇస్తే అక్కడే కాల్చుకొని తిన్నారు. కొద్దిగా బరువైన చేప తగిలేసరికి ఆ పిన్నీసు గాలం కూడా ఒంగిపోయింది.

No comments:

Post a Comment